Sunday 14 March 2010

పురాణాలకి మూలాలు

హిందూ పురాణాలకు మూలాలు సంస్కృతంలో రాయబడిన కొన్ని గ్రంథాలు. వీటిని పలు రకాలుగా వర్గీకరించవచ్చు. వీటిలో ఒక సరళమైన వర్గీకరణ ఒకటి చూద్దాం.

అన్నింటికన్నా ప్రాచీనమైనవి వేదాలు. వేదం అనే పదం విద్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. ఈ పదానికి అర్థం తెలుసుకోవడం అని. ఈ వేదాలు హిందువులకు ప్రాథమిక భావనలు. సృష్టికర్తయైన బ్రహ్మ ఈ జ్ఞానాన్ని సప్తర్షులకు బోధించాడు. వాళ్ళు దాన్ని వ్యాప్తి చేశారు.

వేదాలను నాలుగు భాగాలుగా విభజించారు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఉపనిషత్తులు వీటిలో చాలా ముఖ్యమైన అంశాలు. వీటిని వేదాల సంగ్రహం గా పేర్కొనవచ్చు. వీటిని ఆధారంగా చేసే బోధనలను వేదాంత శాస్త్రం అంటారు.

తర్వాతి గ్రంథాలు బ్రాహ్మణాలు. ఇవి పూజారులు అనుసరించవలసిన యజ్ఞయాగాదులు గురించి తెలియ జేస్తాయి. వీటిలో కూడా పురాణాల గురించి ప్రస్తావన ఉంటుంది.

ఇక ఇతిహాసాలు, పురాణాల్లో చారిత్రాత్మక కథలు చాలా ఉంటాయి. రామాయణం, మహాభారతం, యోగవశిష్టం, హరివంశం ఇతిహాసాలకిందకు వస్తాయి. ఇవి చారిత్రక సత్యాలను నీతికథలు, సంభాషణలు మొదలైన వాటి ద్వారా తెలియబరుస్తాయి. ఇవి వేదాలలోని వాదనలను, తర్కాన్ని అవగాహన చేసుకోని సామాన్య మానవునికోసం సృష్టించబడ్డాయి.

Saturday 13 March 2010

ఉపోద్ఘాతం-2

అసలు హిందూ మతం, పురాణాలు, హైందవతత్వం మధ్య చాలా మంది ఎందుకు గందరగోళానికి గురి అవుతుంటారంటే.. ఇవన్నీ ప్రాచీన ఉద్గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తుల నుంచే ఆవిర్భవించాయి కాబట్టి. ఈ గ్రంథాల్లో చాలా చోట్ల మతానికి సంబంధించిన, తత్వానికి సంబంధించిన విషయాలను మరింత అర్థవంతంగా చెప్పడానికి పౌరాణిక గాధలను ఉదహరిస్తారు. మహాభారతం చాలా ప్రాచుర్యం పొందిన పురాణం. ఇందులో శ్రీకృష్ణుని చే ఉటంకించబడిన భగవద్గీత ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన, అత్యంత పవిత్రమైన మత గ్రంథంగా అభివర్ణించబడుతోంది. ఇందులో కృష్ణుడు యుద్ధ విముఖుడైన అర్జునుడికి కర్తవ్యబోధ చేసి కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు.

మతం, తత్వం, పురాణాలు కలగలిసిపోయి ఉంటాయి. కాబట్టి ఈ మూడింటిలో దేనిగురించి చెప్పాలన్నా మిగతా వాటిని గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. ఇంకా ప్రజల్లో మతం, పురాణాలు ఒకటే ననే భావన ప్రబలంగా ఉంది. ఇది కూడా గందరగోళానికి కొంత వరకూ కారణం. పురాణాల్లో పేర్కొనబడ్డ పాత్రలను కల్పితం అనుకోకుండా వాటికి నిత్యం ప్రార్థనలు జరుగుతుంటాయి. ఈ నమ్మకాన్ని అందరూ గౌరవించినా శాస్త్రీయ విశ్లేషణకు మాత్రం సరిపోదు.

ఈ పురాణాల ఆధారంగా ఎన్నో సాంప్రదాయాలు, సంస్కృతులు,కృతువులు, పండుగలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, వాస్తు మొదలైనవి ఎన్నో ఆవిర్భవించాయి. ఓ వెయ్యి సంవత్సరాల క్రితం హిందూ సంస్కృతి అంతా పురాణాల నుంచే ఆవిర్భవించినట్లు కనిపిస్తుంది. కాలానుగుణంగా తన స్వరూపాన్ని మార్చుకున్నా చాలావరకు అదే సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుంది. నేటి సంస్కృతే రేపటి పురాణమవుతుంది. కాబట్టి సంస్కృతి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Wednesday 3 March 2010

ఉపోద్ఘాతం -1

హిందూ పురాణాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. చాలా సంస్కృతుల్లో మతం, పురాణం, తత్వ శాస్త్రం వేర్వేరుగా ఉంటాయి. కానీ హిందూ మతం అలా కాదు అన్నీ కలగలిసిపోయి ఉంటాయి. ఎందుకు, ఎలా కలిసిపోయాయో తెలుసుకోవాలంటే అసలు హిందూ మతానికి ఆ పేరెందుకొచ్చిందో తెలుసుకోవాలి.
ఇది తెలుసుకోవాలంటే మనం ప్రస్తుతం ఉత్తర భారత దేశంగా పిలుస్తున్న కొన్ని ప్రాంతాలు, పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల సామాజిక పరిస్థితుల్ని గురించి కొంచెం తెలుసుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల వరకు ఈ సంస్కృతి ఎటువంటి బాహ్య ప్రభావాలకు లోనవకుండా ఉంది. అప్పట్లో ఈ మతానికి, సంస్కృతికి ఎటువంటి పేరు పెట్టాల్సిన అవసరం రాలేదు.
అయితే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ సంస్కృతి మూడు ప్రధాన మైన మార్పులకు లోనైంది. ఒకటి పాశ్చాత్య దేశాల్లో ఉద్భవించిన క్రైస్తవం ప్రభావం, రెండు అంతర్గతంగా పుట్టుకొచ్చిన బౌద్ధమతం ప్రభావం, మూడు మహమ్మదీయుల దాడుల ప్రభావం. కాలక్రమంలో ఇవన్నీ సమాజంలో భాగమైపోయాయి. దాంతో ముందు నుంచి పరిఢవిల్లుతూ వస్తున్న సంస్కృతికి ఏదో ఒక పేరు పెట్టాల్సి వచ్చింది. అలా హిందూ అనే పదం తెరమీదకు వచ్చింది. సింధూ నది పరీవాహక ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దాన్నుంచి పుట్టిన పదమే హిందూ.